ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » యువతకు అవినీతిపరులే రోల్ మోడల్స్ అవుతున్నారు: మూర్తి (Narayana Murthy | Infosys | Corruption | Youth | India)
యువతకు అవినీతిపరులే రోల్ మోడల్స్ అవుతున్నారు: మూర్తి
మంగళవారం, 31 జనవరి 2012( 14:49 IST )
FILE
మన దేశంలో అవినీతి మకిలితో కొట్టుకుపోయి, అక్రమ ధనంతో అపరకుబేరులుగా మారుతున్న కొంతమంది వ్యక్తులు యువతకు రోల్ మోడల్స్ అవుతున్నారా..? వారినే యువత స్ఫూర్తిదాయకంగా తీసుకుంటోందా..? అలా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేస్తుందా...? అని అంటే.. అవునని అంటున్నారు సాఫ్ట్‌వేర్ దిగ్గజం నారాయణమూర్తి.
ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను ఉటంకిస్తూ మూర్తి... నీతి, నిజాయితీగా ఉండే వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుంటున్న యువత సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అడ్డదారుల్లో.. అక్రమ మార్గాల్లో, అవినీతికి పాల్పడుతూ ధనాన్ని కూడబెట్టే వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. అలాంటివారినే యువత స్ఫూర్తిగా తీసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది.
అవినీతిపరులను స్ఫూర్తిగా తీసుకుంటున్న యువతను తానేమీ విమర్శించడం లేదనీ, అయితే నీతి, నిజాయితీపరులను మాత్రమే ఆదరించాలని చెపుతున్నానని పేర్కొన్నారు. యువత అటువంటివారిని ఆదర్శంగా తీసుకోవడం వల్ల, ఇలాంటి వారి ఆట కట్టించడం కష్టతరమవుతుందన్నారు.
అదేసమయంలో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని చూసినప్పుడు అవినీతి మకిలితో కొట్టుకుని మసకబారి కనిపిస్తుందని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. కనుక రాత్రికి రాత్రే అపరకుబేరులుగా మారేవారిని యువత నిశితంగా గమనించాలనీ, ఆ డబ్బు ఏ మార్గంలో వచ్చిందో తెలుసుకుని, నిజమైన కష్టంతోనే వారు ఆ స్థాయికి వచ్చి ఉంటే స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు.