ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భారత్-పాకిస్థాన్ బంధం మరింత బలపడాలి : మీరా కుమార్ (India | Pakistan | Meira Kumar | Islamabad)
భారత్-పాకిస్థాన్ బంధం మరింత బలపడాలి : మీరా కుమార్
గురువారం, 23 ఫిబ్రవరి 2012( 10:03 IST )
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలపడాలని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెహ్మిదా మీర్జా ఆహ్వానం మేరకు మీరా కుమార్ అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్-పాక్‌ల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలన్నారు. ఇరు దేశాల ప్రజల్లో సత్సంబంధాలు ఏర్పడాలని కోరుకున్నారు.
ఇందుకు రెండు దేశాల పార్లమెంట్లు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి భారత్-పాకిస్థాన్‌లు ఒకే విధమైన సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉన్నాయని, సంగీతం, సినిమాలు, క్రీడలతో ప్రేమను పంచుకుంటున్నామన్నారు.
ముఖ్యంగా భారత్, పాక్‌లలోని సినీ రంగానికి చెందిన తారలు, సంగీత కళాకారులు, గాయకులు పరస్పరం ఆదరాభిమానాలను కలిగి ఉన్నారన్నారు. క్రికెట్ సైతం ముఖ్య భూమిక పోషిస్తోందన్న ఆమె అన్ని రంగాల్లో మరింత అధికంగా జరిగే ఇచ్చిపుచ్చుకోవడాలు ఇరు దేశాల ప్రజల్లో శాంతిని వేగంగా నెలకొల్పడంలో దోహదపడుతుందన్నారు.