నాలుగేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన 2 జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించింది. వేలం విధానాన్ని కాదని, నిబంధనలన్నీ చాపచుట్టి నచ్చినవారికి అడ్డగోలుగా స్పెక్ట్రమ్ లెసైన్స్‌లు సంతర్పణచేసి దేశ ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిన ఉదంతమది. అందులో సైడ్ షోగా వెల్లడైందే నీరా రాడియా టేపుల వ్యవహారం. టాటా, రిలయన్స్ సంస్థలకు కార్పొరేట్ లాబీయిస్టుగా ఉంటూ పలువురు పారిశ్రామికవేత్తలతో, రాజకీయ నాయకులతో, జర్నలిస్టులతో నీరా రాడియా సాగించిన సంభాషణలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని మించి సంచలనాన్ని కలిగించాయి.