పుట్టిన తేదీల వారీగా మన వ్యవహార శైలిని సంఖ్యాశాస్త్రం క్షుణ్ణంగా చెప్పేస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇందులో వాస్తవాలు లేకపోలేదు. నేటి కంప్యూటర్ యుగంలోనూ జ్యోతిష్యం, వాస్తు వంటి ఇతర శాస్త్రాలను విశ్వసించేవారు కోకొల్లలు. అలాగే ఒక్కో తేదీలో జన్మించిన వారు ఒక్కో విధమైన గుణాలను కలిగి ఉంటారు. ఇక... పద్దెనిమిదో తేదీలో జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం...
ఏ నెలలోనైనా సరే 18వ తేదీన జన్మించిన వారు సాధారణంగానే బుద్ధిమంతులుగా ఉంటారు. నిర్మల మనస్తత్వంతో వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమేర ఆవేశం కలిగి ఉంటారు. తాము చేయని తప్పును అంత సులభంగా ఒప్పుకోరు. తాను చేసిందే సరి అని... వాదనకు దిగి తమ పంతాన్ని నెగ్గించుకుంటారు. ఎవరైనా సమస్యలు చెప్పిన సమయంలో ఉపశమనం కలిగించే రీతిలో వారికి సలహాలిచ్చే ప్రతిభ వీరిలో ఉంటుంది.
ప్రారంభించిన కార్యంలో విజయం సాధించేంత వరకు పట్టువీడని విక్రమార్కుల్లా ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందు జాగ్రత్త కలిగి ఉంటారు. సంగీతంపై మిక్కిలి ప్రీతి కలిగి ఉంటారు. రచయితగా, నాటక విమర్శకులుగా రాణిస్తారు. ముఖ్యమైన విషయాల్లో అభ్యంతరాలు చెప్పడం వీరి గుణం.
ఇక... జీవన విధానం వీరికి ఎక్కువగా వ్యాపారమే. మూలధనాన్ని సేకరించడంలో వీరికి వీరే సాటి. న్యాయశాస్త్రం, రాజకీయం వంటి ఇతర రంగాలపై వీరు ఆసక్తి ఎక్కువ. బాధ్యతల మోత వీరికి తప్పదు.
తమ కార్యాలను జయించడంలో వీరు అత్యధిక ప్రతిభాపాటవాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అషామాషీగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగెయ్యాలి. లేనట్లైతే తీవ్ర నష్టాలను, మనోవ్యధకు గురయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి ఈ తేదీన జన్మించిన పురుషులైనా... స్త్రీలైన పరస్పర అవగాహనతో సుఖసంతోషాలతో జీవితం గడుపుతారు.