రోహిణి నక్షత్రం చంద్రగ్రహానికి ఇష్టమైన నక్షత్రమని జ్యోతిష్కులు అంటున్నారు. "రోహిణి ప్రియయా చంద్రహా" అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
అందుచేత రోహిణి నక్షత్రములో పుట్టిన జాతకులు మంగళవారం పాలతో కలపబడిన అన్నాన్ని దానం చేస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని పండితులు అంటున్నారు.
భాగస్వామిని అధికంగా ప్రేమించే ఈ జాతకులు ఇతరులను ఆకర్షించే ఛాయను, వాక్చాతుర్యతను కలిగి ఉంటారు. స్నేహితులంటే ప్రాణమిచ్చే వీరు గజ ఈతగాళ్లవుతారు.
వృత్తులు, ఉద్యోగాల్లో తీవ్రంగా శ్రమించే వీరికి, ఉదారంగా ఖర్చుచేయడం అలవాటు. అయితే ఖర్చులను అదుపు చేసుకుంటే ధనవంతులవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇంకా.. రోహిణి నక్షత్రంలో పుట్టిన జాతకులు వృత్తిపరంగా రాణించాలంటే వారి పుట్టిన తేదీన బిజినెస్ ప్రారంభించడం శ్రేయస్కరం. పుట్టిన తేదీనే వృత్తిని ప్రారంభించడం ద్వారా వ్యాపారంలో అధికలాభం చేకూరుతుంది.
ఈ జాతకులకు శని, బుధవారాలు మంచిరోజులు. ఈ రోజుల్లో ఏ కార్యాన్నైనా ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తవుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. అయితే పౌర్ణమి రోజున వచ్చే శని, బుధవారాల్లో ఎలాంటి కార్యాన్ని చేపట్టకూడదని వారు అంటున్నారు. వీరి అదృష్ట సంఖ్యలు 4, 5, 6, 8.
ఈ నక్షత్రంలో జన్మించిన వారు నవరత్నాల్లో వజ్రరత్నాన్ని ధరిస్తే కష్టాలు ఏ మాత్రం దరిచేరవని జ్యోతిష్కులు అంటున్నారు. వజ్ర రత్నాన్ని ప్లాటినం, బంగారం, వెండి వంటి మూడింటిలో ఏదేని లోహముతో పొదిగించుకుని శనివారం ధరిస్తే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఈ జాతకులకు చక్కెర వ్యాధి, కంటి చూపు మందగించడం, గుండెపోటు, ఉదరం, గొంతు సంబంధిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. అందుచేత పండ్లు, కొబ్బరి నీళ్లు, టమోటాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు.