స్థలములో గృహనిర్మాణానికి ముందు బావిని త్రవ్వటం మంచిది. ఇలా చేస్తే... గృహనిర్మాణానికి కావలసిన నీటిని ఆ బావి నుంచే వాడుకునేందుకు చాలా సులభంగా ఉంటుంది. ఈశాన్యంలోనే బావి ఉండాలనటం వాస్తు నియమం.
స్థలములో తూర్పు-ఈశాన్యంలో బావి త్రవ్వటం ద్వారా కీర్తి, ప్రతిష్టలు, సకల సంపదలు, ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది.
స్థలానికి ఉత్తర-ఈశాన్యంలో బావి త్రవ్వటం ద్వారా ధనాదాయానికి లోటుండదు. కుటుంబ సుఖ, సౌఖ్యములు సంతానాభివృద్ధి కలుగుతుంది. తూర్పు-ఈశాన్య, ఉత్తర-ఈశాన్య గోడలకు ఆనించి బావిని త్రవ్వ కూడదు.
ఉత్తర- ఈశాన్యంలో కాకుండా ఉత్తర భాగంలో ఈశాన్యం వైపుకు బావి త్రవ్వటం శుభఫలితాలను కలుగజేస్తుంది. అయితే గృహ సింహద్వారానికి, కిటికీలకు ఎదురుగా బావి ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
తూర్పు-ఈశాన్యంలో కాకుండా తూర్పు భాగంలో ఈశాన్యం వైపుకు బావి త్రవ్వటం ద్వారా కుటుంబ సౌఖ్యాలకు లోటుండదు. తూర్పు- ఆగ్నేయ భాగంలో బావిని త్రవ్వకూడదు. దీని వలన అనారోగ్యం, అగ్ని ప్రమాదాలు, ఆర్థిక సమస్యలకు లోనవుతారు. ముఖ్యంగా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.
అదేవిధంగా... ఉత్తర- వాయువ్యంలో బావిని త్రవ్వ కూడదు. దీనివలన శత్రుహాని, అనారోగ్యం వంటివి కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీలకు మనశ్శాంతి లేకపోవడం లేకపోవటం వంటి చెడు ఫలితాలు కలుగుతాయి.
పడమరలో గానీ, పడమర-వాయవ్యంలో గానీ, పడమర-నైఋతిలో గానీ బావిని త్రవ్వకూడదు. పురుషులకు అనారోగ్యాలు, చెడు స్నేహాలు, గౌరవభంగం కలగటం వంటివి కలుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
దక్షిణ భాగంలో గానీ, దక్షిణ-నైఋతిలో గానీ, దక్షిణ-వాయవ్యంలో కూడా బావిని త్రవ్వకూడదు. దీనివలన ఆకస్మిక ప్రమాదాలు, మరణభయం, స్త్రీలకు అనారోగ్యం వంటివి తటస్థిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.