దాదాపుగా ప్రతి ఇంటి లోగిళ్ళలో తులసికోట పెంచడం అన్నది ఆనవాయితీ. కానీ కొత్తగా నిర్మించిన ఇళ్ళలో తులసికోట ఎటువైపు ఉంచాలి అన్న విషయాన్ని వాస్తు శాస్త్ర పద్ధతి ప్రకారం పరిశీలిస్తే... ఆయుర్వేద వైద్యంలో తులసికి ముఖ్యమైన స్థానం ఉండటమే గాకుండా తులసి మొక్క నుంచి వీచే గాలి చాలా పరిశుద్ధంగా ఉంటుందన్న విషయాన్ని ఆధునికమైన పరిశోధనలు కూడా అంగీకరిస్తున్నారు.
ఇకపోతే... వాస్తు ప్రకారం తులసికోటను ఏ వైపులో అయినా నిర్మించుకోవచ్చునని వాస్తు చెబుతోంది. అయితే వేర్వేరు దిక్కుల్లో నిర్మించేందుకు కొన్ని నియమాల్ని పాటిస్తే మాత్రం సరిపోతుంది. అందులో కొన్ని మీకోసం...
ఉత్తర- వాయవ్యంలోకానీ, తూర్పు- వాయవ్యంలోగానీ తులసి కోటను నిర్మించాలంటే నేల ఎత్తుకు కొంచెం తక్కువగా ఉండేలాగా నిర్మాణం చేయాలి. తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు గోడలను ఆనుకుని తులసి కోట నిర్మాణం చేపట్టరాదు.
దక్షిణం దిక్కులో తులసి కోటను నిర్మించుకోదలచినవారు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ఎత్తు లేదా మరి కొంచెం పల్లంలోగానీ నిర్మించాలి. అలాగే పశ్చిమ దిక్కులో తులసికోటను ఏర్పాటు చేయాలంటే... నేల ఎత్తుగా లేక లోతుగా ఉండాలి.
ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశల్లో కుండీలనుగానీ, తులసికోటలనుగానీ ఉంచరాదు. అలా చేస్తే ఈశాన్యం బరువు పెరిగినట్లై వినాశనానికి దారి తీస్తుంది. పూలకుండీలలో పెంచుకునే తులసికోటను నైరుతి, దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయువ్య దిశల్లో మాత్రమే ఉంచాలని వాస్తు చెబుతోంది.