ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందుగా యజమాని ఎటువైపు అంటే ఏ దిక్కున కూర్చుంటాడనే విషయం కూడా చాలా ముఖ్యమైందని వాస్తు చెబుతోంది.
దుకాణంలో ఉత్తర, తూర్పు దిశల్లో పల్లంగా ఉండే విధంగా చూసుకుని నైరుతీ దిశలో క్యాష్ కౌంటర్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని వాస్తు నిపుణుల విశ్వాసం.
ఇకపోతే.. యజమాని ఎప్పుడూ తూర్పుదిశగా ముఖం పెట్టుకుని కూర్చోవాలి. దుకాణం ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం... ఇలా ఏ దిశలోనైనా ఉన్నా కూడా ఉత్తర లేదా తూర్పు వైపున కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి.
తూర్పు, ఉత్తర దిక్కువైపు ఫ్లోరింగ్... పశ్చిమం, దక్షిణ దిక్కుల్లో ఫ్లోరింగ్ కంటే తక్కువ ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి. క్యాష్ కౌంటర్‌ను దక్షిణ, ఆగ్నేయం వైపుగా ఉంచుకోవాలి. ఉత్తర దిశగా ముఖం ఉండే విధంగా కూర్చోవాలి.
ఆగ్నేయంలాగానే నైరుతీ దిక్కు కూడా అత్యంత అనుకూలమైనది. లక్ష్మీదేవి రాకకు ఈ దిశ ప్రశస్తమైనది. అయితే దక్షిణ ఆగ్నేయ దిశగా కూర్చున్నప్పుడు తూర్పుగోడను తాకే విధంగా క్యాష్ కౌంటర్‌ను ఏర్పాటు చేసుకోకూడదు.
తూర్పు ముఖద్వారం ఉన్న దుకాణం లాగానే దక్షిణంవైపు సింహద్వారం ఉండే దుకాణంలో కూడా... దక్షిణం కంటే ఉత్తరం, పడమర కంటే తూర్పు ఎత్తులు తక్కువ స్థాయిలో ఉండేలాగా చూసుకోవాలి. క్యాష్ కౌంటర్‌ను మాత్రం నైరుతీ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి.
దక్షిణ దిక్కున ఉన్న దుకాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య దిక్కుల వైపుగా కూర్చొని వ్యాపారం చేయకూడదు.