ఎంతటి మహనీయులైనా.. దోషాల ప్రభావంతో కాలుజారుతారని మన పెద్దలంటూ ఉంటారు. ప్రస్తుతం "సత్యం" రాజుకు కూడా అదే పరిస్థితి వచ్చిందట. అయ్యగారికి వాస్తు దోషంతోనే ఇన్ని సమస్యలు తలెత్తాయని గౌరు తిరుపతిరెడ్డి అనే వాస్తు నిపుణుడు విలేకరుల సమక్షంలో చెప్పారు. దోషాల ప్రభావం మహారాజునైనా బిచ్చగాడిని చేస్తుందనే... మన పెద్దలమాట.. ప్రస్తుతం నిజమౌతోంది.
ఇంతకీ అసలు విషయమేమిటంటే...? సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు పతనానికి ఆ సంస్థ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాల్లో పూర్తి వాస్తు దోషాలు ఉండటమే కారణమంటున్నారు... తిరుపతి రెడ్డి.
ఇంకా సత్యం రాజు భవనాల వాస్తు దోషాల గురించి ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న సత్యం కంప్యూటర్స్‌కు చెందిన మూడు భవనాల్లో వాస్తు దోషాలు ఉన్నట్లు తాను గుర్తించానన్నారు. రామలింగరాజు కూర్చునే మొదటి భవనంలో ఆయన ఛాంబర్‌కు పశ్చిమ సింహ ద్వారం ఉందని, పశ్చిమ నైరుతి పెరగిపోవడం వల్ల దీని ప్రభావం పురుషుని జీవితాన్ని నాశనం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుందన్నారు.
అదేవిధంగా... విశాఖలో నిర్మించిన సత్యం కంప్యూటర్స్ మరో కార్యాలయంలో... నైరుతి బ్లాక్‌లో దక్షిణ భాగానా ఐదింతల ఖాళీ స్థలం ఉండటం, దక్షిణంలో ద్వారాన్ని అమర్చబడి ఉండటం వంటి ఎన్నో వాస్తు దోషాలు కారణంగానే రామలింగరాజు చిక్కుల్లో పడ్డారని తిరుపతి రెడ్డి అన్నారు.
ఇలా.. సత్యం రాజు కార్యాలయాల్లోనే కాకుండా.. ఆయన ఇంట్లోనూ వాస్తు దోషాలున్నాయని తిరుపతి రెడ్డి వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రామలింగరాజు స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రుకు వెళ్లి ఆయన నివాసాన్ని పరిశీలించానని అక్కడ కూడా కొన్ని వాస్తు దోషాలున్నాయని ఆయన తెలిపారు.
అయితే.. రాజుగారు వాస్తుదోషంతోనే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా..? మరి మీరేమంటారు..?