గృహంలోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలంటే అవసరమైనన్ని కిటికీలు ఉండాలి. కిటికీల కొలతలు కూడా ద్వారాల కొలతలలాగానే వెడల్పు కంటే ఎత్తు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంటిలోని ప్రతి గదికి ద్వారం ఎలా తప్పనిసరో అదేవిధంగా ప్రతి గదికి కిటికీ కూడా అంతే ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు.
దక్షిణ దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం కంటే, ఉత్తర దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా పశ్చిమ దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం కంటే, తూర్పు దిశలో ఉన్న కిటికీల వైశాల్యం ఎక్కువగా ఉండాలి. ఇలా అమర్చిన కిటీకీల ద్వారా శుభ ఫలితాలుంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
ఇకపోతే.. కిటికీ తలుపులకి అద్దాలు పెట్టడం మంచిదే. అయితే ఈశాన్యంలో ఉన్న కిటికీలకు అద్దాలు పెట్టకూడదు. ఆ దిశ నుంచి వచ్చే ఉపయోగకరమైన కాంతి కిరణాలను, రేడియేషన్లను అద్దాలు అడ్డుకుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
గృహనిర్మాణం పూర్తయిన తర్వాత వెలుతురు కోసం.. విశాలమైన కిటికీలను అమర్చేందుకు వీలుండదు. కనుక ఇంటి నిర్మాణానికి ముందే కిటికీలను అమర్చడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇక వెంటిలేటర్ల విషయానికి వస్తే... అన్ని ప్రాంతాలలోనూ సిమెంటుతో చేసిన వెంటిలేటర్లను వాడటం పరిపాటి. రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉన్నప్పటికీ గదిలోని చెడు గాలులు బయటకు పోవటానికి వెంటిలేటర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి గదికి కనీసం రెండు వెంటిలేటర్లు ఉండేలా చూసుకోవాలి.
బాత్రూమ్‌లు, టాయిలెట్లలో పెట్టే వెంటిలేటర్లు, రూముల్లో పెట్టే వెంటిలేటర్ల కంటే బాగా పెద్దవిగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.