గృహావరణలో వృక్షాలను నైరుతి, దక్షిణం, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశల్లో పెంచడం మంచిది. అయితే ద్వారం, కిటికీ, గేటులకు ఎదురుగా వృక్షాలను, మొక్కలను పెంచడం కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈశాన్య భాగంలో ఎటువంటి చెట్లు నాటకూడదు.
ఇంకా ఇరుకు స్థలంలో వృక్షాలు వేయడంవల్ల అవి బాగా పెరిగి ఇంటిలోపలికి గాలి, వెలుతురు రాకుండా చేయడమే కాకుండా ఆ వృక్షాల వేళ్లు గృహానికి, ప్రహరీ గోడలకు, సెప్టిక్ ట్యాంక్‌లకు, మురికినీరు ప్రవహించేగొట్టాలకు అడ్డంగా వచ్చే అవకాశం ఉంది. అందుచేత ఇరుకు స్థలాల్లో మొక్కలు, చెట్లను నాటడం మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇక.. తులసి మొక్కను భూమి నుంచి పెరిగే విధంగా నాటుకోవాలనుకుంటే తూర్పు, ఉత్తర దిశల్లో పెంచడం మంచిది. చాలామంది పెద్ద సిమెంటు కోట కట్టించి దాంట్లో తులసి మొక్కను వేస్తుంటారు. అలాంటి కోటలు దక్షిణం, పశ్చిమ దిశలలో పెట్టాలి.
అపార్ట్‌మెంట్లలలో కుండీలలో తులసి మొక్కలను పెంచుతారు. వీటిని కూడా ఈశాన్యం తప్పా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. భూమిలోంచి మొక్కను పెంచే అవకాశం ఉన్నటువంటి వాళ్లు నేల మీద చిన్న గట్టు కట్టించి అందులో మొక్కను వేయడంవల్ల మొక్క ఏపుగా పెరిగి, జీవకళ ఉట్టిపడుతూ స్త్రీలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
తులసి మొక్కలను మిగిలిన పూల మొక్కల వలె ఇంటి చుట్టూ పెంచుకోవటం ఎంతో మంచిది. తులసి మొక్కలను నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ద్వారం ఎదురుగా సిమెంటుతో పెద్ద కోటకట్టించి తులసి మొక్కను పెంచడం దోషం. పూల కుండీలను మేడమీద దక్షిణ, నైరుతి, పశ్చిమాల్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.