మీ గృహంలోని గదుల గోడలన్నీ ఒకే ఎత్తు, ఒకే మందం ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. గోడలు వెలుపలికి గాని, లోపలికి గాని వంగి ఉంటే దోషమని వారు చెబుతున్నారు.
అలాగే దక్షిణ పశ్చిమాలలో గోడలు ఎత్తుగాను, తూర్పు ఉత్తరాలలో గోడలు తక్కువ ఎత్తులో నిర్మించడం దోషం. అందుకే పునాది స్థాయి నుంచి గోడల నిర్మాణంలో జాగ్రత్త వహించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంటి నిర్మాణంలో పూజగది ఎలా ఉండాలంటే..? తూర్పు లేదా ఉత్తర దిశకు ఎదురుగా కూర్చుని పూజించే విధంగా ఉండాలి. దీనికోసం ఉత్తర దిశలలో పూజ అరుగు నిర్మించి చిన్న విగ్రహాలు, పటాలు ఏర్పరుచుకోవాలి.
ఇక వంటగది.. తూర్పుదిశకు ఎదురుగా నిల్చుని వంట చేయడానికి వీలుగా ఏ మూలలోనైనా వంటగది ఏర్పరుచుకోవచ్చు. అయితే వంటగదిలో ఆగ్నేయమూలలో మాత్రమే పొయ్యి ఉంచాలి. ఒకవేళ తూర్పున లేదా దక్షిణంలో సింహద్వారం ఉంటే, ఆగ్నేయంలోనే వంటగది నిర్మించాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇక విలువైన వస్తువులను దాచే గదిని ఉత్తరంలో గాని వాయువ్య ఉత్తరంలో గాని నిర్మించుకోవచ్చు. నగలు, విలువైన వస్తువులను దక్షిణ దిశలో బీరువాలు, ఐరన్ సేఫ్‌లలో అమర్చి ఉత్తరదిశకు తలుపులు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
పడక గది విషయానికొస్తే.. దక్షిణ, పశ్చిమ దిశల్లో పడకగదులు నిర్మించుకోవాలి. ఎక్కడైనా సరే ఉత్తరదిశ తల ఉంచి నిద్రించకూడదు. కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్త వహించాలి.
మరోవైపు.. సింహద్వారానికి ఎడమపక్క వాహనశాల, పశుశాల, ఉత్తర వాయవ్యాలలో పూలతోట, ఆగ్నేయ దక్షిణాలలో సేవకుల గదులు, నైరుతిలో యంత్రాయుధాలను ఉంచే గదులను నిర్మించవచ్చు.
ఇకపోతే.. ఈశాన్యంలో తప్ప మిగిలిన ఏ మూలలోనూ బాత్‌రూమ్‌ల నిర్మాణం చేయకూడదు. అయితే తూర్పు-ఈశాన్యాలలో కేవలం స్నానాల గదులుండవచ్చునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.