ఆఫీసులో మీరు కూర్చునే విధానాన్ని బట్టి లాభ, నష్టాలుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు దిక్కులను అనుసరించి కూర్చోవాలని వారు చెబుతున్నారు.
ఆఫీసు యజమాని తూర్పు ముఖముగానూ, ఉత్తరముఖముగానూ కూర్చోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే తూర్పులేక ఉత్తర ముఖముగా కూర్చునే విధంగా కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
తూర్పు ముఖముగా కూర్చున్నప్పుడు క్యాష్ బాక్స్ ఉత్తరముఖముగా యజమాని కుడివైపు ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరముఖముగా కూర్చున్నప్పుడు క్యాష్ బాక్స్ యజమాని ఎడమచేతి వైపున తూర్పు ముఖముగా ఉండేవిధంగా సిద్ధం చేసుకోవడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అలాగే ఆఫీసులో మీ వీపును ఎప్పుడూ తలుపుకి ఆనుకునేటట్లు కూర్చోకండి. అలాగే మీరు కూర్చున్న చోటనుండి మీకు ప్రవేశద్వారం కన్పిస్తుండాలి. ఆఫీసులో మీ పై అధికారులు లేదా కింది ఉద్యోగులు మీకు పూర్తి సహకారం ఇవ్వాలంటే మీరు కుర్చున్న కుర్చీ వెనక గోడమీద పర్వతాలున్న దృశ్యాన్ని తగిలించండని వాస్తు నిపుణులు అంటున్నారు.