వేదాలు అభ్యసించడమంటే ఆషామాషీకాదు. అకుంఠిత దీక్ష, నిరంతర సాధన, కంఠోపాఠం, భక్తిశ్రద్ధలు, తుచ తప్పకుండా పాటించాల్సిన నియమనిబంధనలు ఎంతో ముఖ్యం. ఏడేళ్ళ ప్రాయం నుంచే వేదపారాయణం సాగుతుంది. గతంలో ఈ విద్యను అభ్యశించేందుకు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. వేద విద్యను పూర్తి చేసేందుకు కనిష్టంగా ఏడు సంవత్సరాల కాలం పడుతుంది.
ఆ సమయంలో ఈ విద్యను అభ్యసించే వారికి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అందువల్ల ఆ కాలంలో పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే ప్రస్తుతం వేద పండితులకు పెరుగుతున్న ఆదరణ, లభిస్తున్న గుర్తింపు, విదేశాల్లో వేదపండితుల కొరత, పేరొందిన ఆలయాల్లో ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం వేద విద్యాభ్యాసంపై యువత ఆసక్తి చూపుతోంది.
ఈ డిమాండ్ వల్ల గత ఏడు దశాబ్దాలుగా వేద విద్యాభ్యాసం బోధిస్తున్న రాజమండ్రిలోని వేదశాస్త్ర పరిషత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కళాశాలలో చేరేందుకు యువత పోటీ పడుతున్నారు. సాధారణంగా వేద విద్యలోని రుగ్వేదాన్ని అభ్యసించేందుకు 12 సంవత్సరాలు, యజుర్వేదానికి పదేళ్లు, సామవేదానికి ఎనిమిదేళ్లు, అధర్వణ వేదపారాయణానికి ఐదేళ్ల సమయం పడుతుంది. వేదపారాయణం యేళ్ళ తరబడి సాగినప్పటికీ.. ఈ విద్యను అభ్యసించే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. దీంతో ఈ విద్య పట్ల చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు.
|