కలియుగ దైవ దర్శనం అనంతరం ప్రతి ఒక్కరూ దర్శించే పుణ్యక్షేత్రం తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దేవాలయం. అయితే అమ్మవారి దర్శనం కోసం వాహనాల్లో వెళితే జేబులు గుల్లవడం ఖాయం. ఎందుకంటే వాహనాలలో వచ్చే భక్తులు తమ వాహనానికి పార్కింగ్ ఫీజు రూపేణా అక్కడి కాంట్రాక్టర్లు నియమించినవారికి రుసుము చెల్లించాలి.
ఇలా వసూలు చేసే హక్కు తితిదే కల్పించింది మరి. ఇందుకు గాను కాంట్రాక్టర్ల వద్ద ఏడాదికి కోటిన్నర రూపాయలను వసూలు చేస్తోంది. కనుక తాము వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేయక తప్పదంటున్నారు సదరు కాంట్రాక్టర్లు.
చిన్న వాహనాలకైతే 30 రూపాయలు వడ్డన. పెద్ద వాహనాలకు రూ.50, బస్సులకైతే ఏకంగా వంద నోటు ఇచ్చుకోవాల్సిందే. దీంతో బెంబేలెత్తుతున్న భక్తులు తమ వాహనాలను దేవాలయానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నారు. అలా దూరంగా ఉన్న వాహనాలను కాంట్రాక్టర్లు వదులుతారా...? అక్కడికీ వెళ్లి రుసుము చెల్లించాల్సిందేనని భక్తులను వేధిస్తున్నారు. బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. ఏడు కొండలవాడా... ఏమిటయ్యా భక్తుల "వాహన" కష్టాలు.
|