|
హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద పండుగలకు భక్తులు ఆయా దేవాలయాలలకు భారీ సంఖ్యలో తరలిరావడం... ఆలయంలో ఏర్పాట్లు సరిగా లేక కొన్నిసార్లు తొక్కిసలాటలు జరుగుతుండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అదలా ఉంచితే... నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగే తిరుమల భక్తులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది.
భక్తులకోసం ఏర్పాటు చేసిన వైకుంఠం క్యూ కాంప్లెక్సులు నిండి ఉంటాయి. శ్రీవారి దర్శనం కోసం ఈ కాంప్లెక్సుల నుంచి భక్తులను విడిచిపెట్టిన వెంటనే ఒకరిని తోసుకుంటూ మరొకరు పరుగెట్టడం సర్వసాధారణం.
ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు, దర్శించుకుని వెళ్లే భక్తులకు వెండివాకిలి ఒక్కటే మార్గం. ఇక్కడ భక్తుల తోపులాట తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఆ తోపులాటల్లో చిన్నారులతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే కుటుంబాలు పడే పాట్లు వర్ణనాతీతం.
ఒకవైపు వేంకటేశుని కనులారా వీక్షించాలని ఆశ... మరోవైపు మహా సముద్రంలాంటి తోటి భక్తుల తోపులాట. దీనిని అధిగమిస్తూ స్వామివారిని దర్శించుకుని వెళుతున్నారు భక్తులు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆంజనేయరెడ్డి కమిషన్ కోరింది. అయితే దీనిపై నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు కనబడటం లేదు.
ఆగమశాస్త్రం ప్రకారం ఒకే ద్వారం ఉన్న ఆలయం... అయితే అందుకు అనుగుణంగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు తగు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. భక్తుల భద్రతకు ఆ ఏడుకొండలవాడే దిక్కు.
|