సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఆదివారం నాడు సూర్య నమస్కారం చేయడం చాలా ఉత్తమమని పండితులు అంటున్నారు. సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఉదయాన్నే సూర్య స్తోత్రం పఠించేవారికి అష్టైశ్వర్యాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఆదివారం నాడు ఎరుపురంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆ రోజు గోధుమలతో చేసే వంటకాలు పూరీ, చపాతీ వగైరాలు భుజించడం ఆరోగ్యదాయకం. పూరీ, చపాతీలను పప్పు, బంగాళాదుంపలతో చేసిన కూరలతో తీసుకోవడం మంచిది. అంతేగాకుండా ఆదివారం నారింజ పండ్ల రంసం స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి కొత్త తేజం చేకూరుతుందని పండితులు అంటున్నారు. ఆదివారం ఉదయాన్నే ఆలయ దర్శనం చేసుకునే వారికి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. ఇకపోతే.. ఆదివారం సూర్యోదయం తర్వాత స్త్రీలు ఎరుపు పూవులు తలలో ధరించడం సౌభాగ్య చిహ్నం. అదేవిధంగా ఆలయ దర్శనం గావించి ఎరుపు రంగు పువ్వులను, గోధుమలను స్వామికి సమర్పించడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంకా ఆదివారం సాయంత్రం ఆదిత్యుని గుడికి వెళ్లి ఎర్రటి ప్రమిదలతో నేతి దీపం వెలిగించే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. పురుషులకైతే ఉన్నత పదవులను అలంకరించడం, వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. |