సోమవారాల్లో వచ్చే అమావాస్యను సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారని పండితులు అంటున్నారు.ఈ సర్వ అమావాస్య రోజున గంగానది, తుంగభద్ర వంటి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా.. తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై ఆలయాన్ని సోమవారం వచ్చే ఈ సర్వ అమావాస్యనాడు దర్శనం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. తిరువణ్ణామలై ఆలయంలో పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసే ఆనవాయితీ ఉంది. అయితే ఈ సర్వ అమావాస్య రోజున తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేసే వారికి వెయ్యిమార్లు గిరిప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుందని పురోహితులు అంటున్నారు.ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పండితులు అంటున్నారు. |