ఈ నెల ఏడో తేదీ (మంగళవారం) వ్యాసపూర్ణిమ. కర్కాటక సంక్రమణం దక్షిణాయన ప్రారంభమయ్యే ఈ రోజునే వేదవ్యాసుల వారి జన్మదినం. అందుచేత వ్యాసపూర్ణిమ రోజున వ్యాస దేవుని పూజించాలి.గురుపూజ చేయాలి. నిజానికి గురుపూజ ఈ రోజే. చదువులు చెప్పే గురువుని, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరించి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవులున్నారని భావించి ఆరాధించాలని పురోహితులు అంటున్నారు. " చాతుర్మాసం ద్విమాసం వా సదైకత్రైవ సంవసేత్" అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని ప్రకారం శ్రీ కృష్ణుని, వ్యాసుని, జైమిని సుమంత వైశంపాయన పైలాది వ్యాసశిష్యులను పూజించాలి. ఈ రోజునే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం, దక్షిణాయనం ప్రారంభం కావడం జరుగుతుంది. ఇంకా ఇదే దినాన విష్ణుపూజ, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం సత్ఫలితాలనిస్తుందని పురోహితులు అంటున్నారు. దీంతో పాటు వ్యాసకృతాలైన పురాణాది గ్రంథాలను వ్యాసపూర్ణిమ రోజున పఠనం చేయడం ద్వారా సుఖ సంతోషాలు, సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. |