వేదరాశిని విభజించి రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా ప్రపంచానికి అందించిన మహానుభావుడు వ్యాసమహర్షి. అష్టాదశ పురాణాలను, ఉపపురాణాలను పంచమవేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని రచించిన వ్యాసదేవులను వ్యాసపూర్ణిమ రోజున స్తుతించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఆ రోజున పురాణాలు, వేదాలను పఠించడం మంచిది. ఆషాఢ శుద్ద పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. మంగళవారం (07-07-09) వచ్చే ఈ పూర్ణిమను పురస్కరించుకుని దేశమంతటా సంప్రదాయంగా గురుపూజ మహోత్సవాలను జరుపుతారు.ఈ రోజున లక్ష్మీ పూజ, విష్ణుపూజ చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. వ్యాసపూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని, పూజగది శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. విష్ణు ప్రతిమ లేదా, పటానికి ముందు ఒక అరటి ఆకును వేసి, ఆ ఆకుపై బియ్యం పోసి తెల్లటి దారాలు కట్టిన కలశాన్ని ఉంచాలి. ఆ కలశం గొంతువరకు జలంతో నింపి ఆపై పచ్చటి మామిడి ఆకులు, టెంకాయను ఉంచి పసుపు కుంకుమ, పుష్పాలు పెట్టాలి. ఇలా సిద్ధం చేసుకున్న కలశానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ అరటి ఆకుపై పోసిన బియ్యాన్ని ఇంట్లోని బియ్యంతో కలుపుకుంటే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందనిపురోహితులు అంటున్నారు. ఇంకా కలశంలోని నీటిని గృహమంతా చల్లడం చేస్తే రోగనివారణ, ఆర్థిక ఇబ్బందులు, అప్పులబాధ తొలగిపోతాయని వారు చెబుతున్నారు. |