శ్రీకాళహస్తిశ్వరాలయంలో నిత్యం రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు వెయ్యికిపైగా జరిగే ఈ పూజలు.. శని, ఆదివారాల్లో మాత్రం మూడు వేలకు చేరుతాయి.
ఈ పూజల్లో వాడే వెండి నాగపడగలను దేవస్థానం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల నుంచి తెప్పిస్తారు. దీనికోసం ప్రతి ఏటా నాలుగు కోట్లను వ్యయం చేస్తున్నారు.
రాహు-కేతు పూజల ద్వారా శ్రీ కాళహస్తీశ్వరాలయానికి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చినా.. పూజల తర్వాత హుండీల్లో భక్తులు వేసిన వెండి నాగపడగలను వాడకపోవడంతో.. వీటి నిల్వలు దాదాపు 13 టన్నులకు చేరుకున్నాయి. ఇలా వెండిని నిల్వచేసుకుని నాగపడగల కోసం కోట్లను ఖర్చు చేయడం దేవస్థానానికి భారంగా పరిణమించింది.
దీంతో వెండి పడగల తయారీని దేవస్థానమే చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లతో తెప్పించుకునే వెండి పడగలకు స్వస్తి చెప్పి.. వెండి నాగపడగల తయారీ యంత్రాన్ని అధికారులు రూ. మూడు లక్షలతో తెప్పించారు. దీన్ని దేవస్థానం పాత కార్యాలయంలో ఏర్పాటు చేసి నాగపడగల తయారీని ప్రారంభించారు.
దీంతో చిన్నవైనా, పెద్దవైనా నాగపడగల జత తయారీకి రూ.1.50ని ధర్మకర్తల మండలి కూలీగా నిర్ణయించింది. దీనివల్ల ఒక పడగ జతపై కూలి కింద రూ. 17.50 దేవస్థానానికి మిగులుతుందని అధికారులు వెల్లడించారు. నాగపడగల తయారీ లెక్కన శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి లక్షల్లో మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.