క్రీస్తు జన్మించిన పవిత్ర ప్రదేశం... బెత్లహామ్!
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంకు దక్షిణాన సుమారు ఆరు మైళ్ళ దూరంలో ఉంది... బెత్లహామ్. డెడ్‌సీని ఆనుకుని ఉన్న జుడియా ప్రాంతపు ఉత్తరభాగంలో ఉందీ పట్టణం. పచ్చని ప్రకృతి, నింగిని తాకుతూ పర్వతాలు, కాంతులీనుతూ పొడువాటి చర్చిలు, ఆ చర్చిల్లో మారుమోగుతున్న గంటలు... ఇలా బెత్లహామ్ పట్టణం అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. డిసెంబర్ నెలలో గుండె ఘనీభవిస్తున్నంతగా చలిగాలులు... స్నేహభావానికి సంకేతంగా నింగి నుండి జాలువారి పృధ్విని సుతారంగా తాకుతూన్న మంచు బిందువులు... నిష్కల్మష హృదయాలకు ప్రతీకగా చెంగుచెంగున గెంతే గొర్రెపిల్లలు... దయాపూర్ణ రాగాలకు రసధునులను అందిస్తూ కదిలే ఆలివ్ చెట్ల గుబురులు... ఇలా బెత్లహామ్ వాతావరణమంతా... క్రిస్మస్‌కు స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతుంది.
పవిత్ర గుహ ప్రాంతంలో... బెత్లహామ్ నగరానికి సరిగ్గా నడిబొడ్డున మాంగర్ స్ట్రీట్ ఉంది. పెద్ద పెద్ద భవంతులతో, అందమైన చర్చిలతో ఈ వీధి శోభాయమానంగా కనిపిస్తుంది. ఆ వీధిలో అలా... అలా...ముందుకు కదిలినప్పుడు మాంగర్‌స్క్వేర్ దర్శనమిస్తుంది. విద్యుద్దీపాల కాంతితో అందంగా అలరారే పెద్ద భవంతి ఇది. దీని తరవాత గ్రొట్టో ఆఫ్ నేటివిటీ కనిపిస్తుంది. జీసస్ జన్మించిందీ గుహ ప్రాంతంలోనే! ఇక్కడ 12వ శతాబ్దానికి చెందిన దైవపీఠం ఒకటి ఉంది. దేవతలకు ముఖ్యంగా మేరీమాతకు సమర్పించే కానుకలను ఉంచే ఈ పీఠం మీద వెండితో తయారై... ధగధగ మెరుస్తూ ఉన్న నక్షత్రమొక్కటి దర్శనమిస్తుంది. ఆ నక్షత్రం మీద లాటిన్‌లో- హిక్ డీ వర్జిన్ మరియా జీసస్ క్రిస్ట్మస్ నేటస్ ఎస్ట్ (పవిత్ర మేరీమాతకు బిడ్డగా క్రీస్తు జన్మించింది ఈ ప్రాంతంలోనే) అని అందంగా లిఖితమై ఉంటుంది. దీని తరువాత క్రైస్తవ పూజా మందిరం కనిపిస్తుంది.
మేరీమాత తన శిశువు జీసస్‌ను పడుకోబెట్టిందీ మందిరంలోనే! క్రీస్తు జననానికి సంబంధించిన చిత్రపటాలను కలిగిన అరుదైన గుహ ఇది! సర్వాంగసుందరంగా... కొవ్వొత్తుల కాంతులతో మెరిసే ఈ గుహ చూపరుల హృదయాలను ఇట్టే హత్తుకుంటుంది. ఈ గ్రొట్టో ఆఫ్ నేటివిటీకి పైప్రాంతంలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అందమైన చర్చి ఒకటి కనువిందు చేస్తుంది. అదే చర్చ్ ఆఫ్ నేటివిటీ విశాలమైన భవనం, ప్రశాంతతకు అలవాలమైన ప్రార్థనా ప్రదేశం, ఎత్తయిన గోపురం, దాని లోపల భారీ గంట... మొదలయిన వాటితో సుమనోహరంగా ఉంటుందీ చర్చి.
ఈ చర్చ్‌కు 1600 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రైస్తవ మత సిద్ధాంతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అత్యంత ప్రాచీనమైన చర్చి కూడా ఇదే! క్రీ.శ.330 సంవత్సరంలో హెలీనా దీన్ని నిర్మించింది. మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి కానస్్టాంటిన్ తల్లే హెలీనా! క్రీస్తు, ఆయన ముఖ్య సహచరులు బోధించిన సువార్తలయిన గోస్పెల్‌లలో ప్రస్తావించిన ప్రదేశాలను కనుగొనే నిమిత్తం... కానస్్టాంటిన్ తన తల్లి హెలీనాను పంపాడు. ఆమె ఆ సందర్శనలో అనేక ప్రదేశాలను కనుగొంది. క్రీస్తుకు సంబంధించిన శిలువలు, శిథిలాలను సైతం... ఆమె చాలా ప్రాంతాలలో కనుగొంది. ఈ సందర్భంగా హెలీనా ఒక గుహను కొనుగొనడం జరిగింది.
అదే క్రీస్తు జన్మించిన స్థలమయిన గ్రొట్టె ఆఫ్ నేటివిటీ! జీసస్ గుహలో జన్మించాడని గోస్పెల్‌లలో కచ్చితంగా పేర్కొనకపోయినా ఈ గ్రొట్టో ఆఫ్ నేటివిటీలోనే జీసస్ జన్మించినట్లు స్థానికులు చాలా ప్రాచీనకాలంనుంచి నమ్ముతూ వస్తున్నారు. ఈ గుహపైన కానస్్టాంటిన్ సహాయంతో హెలీనా నిర్మించినదే చర్చ్ ఆఫ్ నేటివిటీ!
|