అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్... అంటూ మహిళలు ఎంతో హుషారుగా జరుపుకునే పండుగ అట్లతద్ది. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు వస్తుంది. ఈ పండుగ స్త్రీలకు చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని వ్రతాలను వివాహితులైన స్త్రీలు మాత్రమే ఆచరిస్తుంటారు. అయితే ఈ పండుగను పిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.
ఈ పండుగను కొన్ని పల్లెలు ఊయల పండుగ అని పిలిస్తే మరికొన్ని చోట్ల గోరింటాకు పండుగ అంటుంటారు. మొత్తంమీద చంద్రోదయ ఉమావ్రతం- అట్లతద్దికి ఇలా రకరకాలైన పేర్లు ఉన్నాయి. అట్లతదియనాడు చంద్రోదయం అయ్యేవరకూ భక్తిశ్రద్ధలతో ఉపవాసముంటారు. చంద్రోదయం కాగానే స్నానమాచరించి ఆ తర్వాత అట్లు వేసుకుని నివేదనకు సిద్దం చేసుకుంటారు.
ఆ తర్వాత ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను వింటారు. ఆకథాక్షతలను తలపై ఉంచుకుని ముత్తైదువులతో కలిసి భోజనం చేస్తారు. ఇలా వ్రతాన్ని ఆచరిస్తే కన్నెపిల్లలకు అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహం లభించి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, పిల్లపాపలతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని ఈ వ్రతాన్నిఆచరిస్తారు.
అట్లతదియనాడు ఉమాదేవిని... "ఓం హ్రీం కాలాభ్రాం భా కటాక్షై రశికుల భయదాం మౌలిబద్దేందురేఖాం శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్ సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేత్ దుర్గాం జయాభ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః" అని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయి.
|