తన తల్లి వినత తన తోడి కోడలు కద్రువకు దాస్యం చేస్తుంటే చూసి భరించలేక, స్వర్గలోకానికి వెళ్లి అమృతభాండాన్ని తెచ్చి కద్రువకిచ్చి, తన తల్లికి దాస్యపు చెర నుంచి విముక్తి కలిగించిన మహామహుడు గరుడభగవానుడు.అమృత భాండాన్ని అపహరించుకుని వెళుతున్న అతడి మీదకు దేవేంద్రుడైన ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే దానికి ప్రతిగా తన రెక్కలోనుంచి ఒక ఈకను పీకి దాని మీదికి వేసి, ఆ వజ్రాయుధాన్ని నిరోధించిన బహు పరాక్రమ శాలి గరుడుడు. మాతృమూర్తిపై భక్తి, శౌర్య సంపద కలిగిన గరుడుడికి ప్రీతికరమైన "గరుడ పంచమి" రోజున ఆయనను ప్రార్థించే వారికి సకల సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే గరుడ పంచమి, నాగపంచమి (జూలై 26వ తేదీ ఆదివారం)గా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి వాహనం, మిత్రుడు, దాసుడైన గరుడుడిని స్తుతించాలి. ఈ రోజున గరుత్మంతుడి విగ్రహాన్ని దేవాలయాల్లో ప్రతిష్టించిన వారికి సత్సంతానం కలుగుతుందని విశ్వాసం. వాహనలాభం, కోరిక కోరికలు నెరవేరడం, విష్ణులోక నివాసభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా దేవాలయాల్లో గరుడ వాహనం.. ఒక మోకాలును వంచి, మరొక కాలిమీద నిటారుగా కూర్చుని రెండు చేతులను చాచి మూల విరాట్టును చూస్తున్న భంగిమలో ఉంటుంది." తన కర్తవ్య నిర్వహణ కోసం తాను ఏ క్షణంలోనైనా సిద్ధమే..! అన్నట్లుగా గరుడుడు దర్శనమిస్తాడు. ఆ విధంగానే మనమూ కర్తవ్య నిర్వహణకు అనుక్షణమూ సిద్ధంగా ఉండాలన్నదే "గరుడపంచమి" పరమార్థము. అంతేగాకుండా మనం కూడా గరుత్మంతుడిలాగా మాతృభక్తిని కలిగి ఉండాలి. శారీరక మానసిక బలాలను పెంచుకోవాలి.అంతేగాకుండా.. తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోయిన గరుత్మంతుడిని "గరుడ పంచమి" రోజున నిష్టతో పూజించే వారికి పాపాలు తొలగిపోయి, పుణ్య ఫలితాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. |