హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » పండుగలు » సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీపండుగ! (Rakhi Festival| Brothers| Sisters| Shravana Purnima| Raksha bandhan)
 
WD
శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ" లేక "జంధ్యాల పూర్ణిమ" మరియు "రాఖీ" లేక "రక్షాబంధన్" పండుగ అని పిలుస్తూ ఉంటారు.

అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను గడుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగ రోజున జంధ్యాలు ధరించే వారు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు.

వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తిని ప్రారంభించడం, ప్రారంభఋక్కును-చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు.

ఈ విధంగా కాలక్రమంలో "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందిన శ్రావణ పూర్ణిమ నాడు ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు, భార్య-భర్తకు ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. పూర్వం యుద్ధానికి వెళ్ళే వీరునికి విజయం ప్రాప్తించాలని ఆశిస్తూ ఈ రక్షాబంధననను కట్టే వారని పురాణాలు చెబుతున్నాయి.

"యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||"

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం.

ఇక.. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే..? పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు.

అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది.

అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా రాఖీకి గల పవిత్రత ఏమిటంటే..? భార్య- భర్తకు, సోదరి- సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు సోదరుడు/భర్త బాసటగా నిలవాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ'. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు.

ఇదిలా ఉంటే... పూర్వం విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు.

ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట పాదుషా భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాథలు ఉన్నాయి.

అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుందాం. మరి సోదరీ, సోదరులకు రాఖీ శుభాకాంక్షలు..
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.