ఉడిపి శ్రీకృష్ణుని మహా భక్తుల్లో ఒకరు భక్త పురంధర దాస. కర్ణాటక సంగీతంలో పురంధర దాస లబ్ధ ప్రతిష్టులు. పురంధర దాస విరచించి గానం చేసిన పాటలు ఇప్పటికీ భక్తులు తన్మయత్వంతో ఆలపిస్తున్నారు. కర్ణాటక సంగీతానికి కొత్త రూపును ఇచ్చినవారు పురంధర దాస. కన్నడ ప్రజలు పురంధర దాసును కర్ణాటక సంగీత పితామహ అని ముద్దుగా పిలుచుకుంటారు.
పురంధర దాసుల వారు 14వ శతాబ్దంలో శివమొగ్గ (షిమోగా) జిల్లా తీర్ధనహళ్లి సమీపంలోని క్షేమపురలో జన్మించారు. ఆయన తండ్రి పేరు వరదప్ప నాయక. ఆయన వ్యాపారంలో బాగా సంపాదించారు. వరదప్ప నాయక ఏకైక కుమారుడు పురంధర దాస. ఆయన తండ్రి పురంధర దాసుల వారికి ముద్దుగా శ్రీనివాస నాయకగా పిలుచుకునే వారు. పురంధర దాసుల వారు చిన్ననాటి నుంచే కన్నడ, సంస్కృత భాషల్లో అనేక అంశాలను నేర్చుకున్నారు. దానితో సంగీతమంటే పురంధర దాసుల వారు ప్రాణమిచ్చేవారు.
పురంధర దాసుల వారికి 16ఏళ్ల ప్రాయంలోనే సరస్వతీబాయితో వివాహం జరిగింది. అది జరిగిన కొన్నాళ్లకే తల్లిదండ్రులను పురంధర దాసుల వారు కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత పురంధర దాసుల వారు పూర్తిగా ఆధ్యాత్మికంలోకి మారారు. ఇదే సమయంలో ఆయన విజయనగర సామ్రాజ్యం అంతా తిరిగారు. జీవితంలో చివరి సమయాన్ని హంపిలోని పురంధర మండపంలో గడిపారు.
|