కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా నిర్వహించే పడవ పందేలు ఎంతో ఉత్సాహాన్ని రేకిత్తిస్తాయి. కేరళీయుల ముఖ్య పండుగ అయిన ఓనమ్ సంబరాల్లో భాగంగా చురులన్ వల్లమ్, ఇరుత్తుకుతీ వల్లమ్, ఓడి వల్లమ్, వేప్పు వల్లమ్, వడక్కనొడి వల్లమ్, కొచు వల్లమ్ పేర్లతే నిర్వహించే ఈ పడవ విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ పోటీల్లో ముఖ్యమైనది అరన్‌ములా ఉత్రతద్ధి స్నేక్ పడవ పందెం.
ఇది కేరళీయుల సాంప్రదాయ పడవ పందెం. కేరళలోని పతనమ్‌హితా జిల్లాలో అరన్‌ములా ఊరు ఉంది. ఇక్కడ ఉన్న కృష్ణార్జునుల ఆలయం చాలా ప్రసిద్ధి గాంచినది. భాద్రపద మాసంలో ఉత్రితద్ది రోజున కృష్ణార్జున విగ్రహాలను పాండవులు ఇక్కడ ప్రతిష్టించారని భక్తుల నమ్మకం. కనుక ఈ ఆలయం ఎదుట ప్రతిఏటా ఈ తరహలో పడవ పందేలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 1700 సంవత్సరాలు అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
స్నేక్ పడవ పందెంలో దాదాపు 41 స్నేక్ పడవలు పాల్గొంటాయి. ఈ పడవ పోటీలతో ఓనమ్ సంబరాలు ముగుస్తాయి. ఈ ఏడాది ఓనమ్ సంబరాల్లో భాగంగా స్నేక్ పందేలు సెప్టెంబర్ 16న జరుగనున్నాయి. పంపా నదిలో జరిగే ఈ పందేలకు పల్లియోడా సేవా సంగోమ్ సారథ్యం వహిస్తుంది. పడవ నడిపే వాళ్లు సాంప్రదాయక పడవ పాటలు ఆలపిస్తూ ఉత్సాహాన్ని తెచ్చుకుంటుంటారు.
వారు తెల్లని పంచెలు కట్టుకుని తలపాగాలు చుట్టుకుని తమ పడవలకు బంగారు రంగు లేసులను అలంకరిస్తారు. పడవ మధ్యలో ఉండే అలంకారపూరితమైన గొడుగులు ఈ ఉత్సవానికి కొత్త అందాన్ని తీసుకువస్తాయి. కేరళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఈ పందేల్లో పాల్గొంటారు. ప్రతి పడవలోనూ నలుగురు మార్గనిర్దేశకులు, 100 మంది రోవర్లు, 25 మంది గాయకులు ఉంటారు.
ఈ గాయకులు "వంచిపట్టు" అనే పాటను అందుకుని లయబద్ధంగా ఆలపిస్తుంటారు. ఈ వంచిపట్టులో నావికులు కూడా శృతి కలిపి చూపరులను ఉత్సాహపరుస్తుంటారు. పడవలు ధృడంగా ఉండి, నీటిలో సులభంగా తేలేందుకు వీటికి చేప నూనె, కొబ్బరి నూనె, కార్బన్‌ల వంటివాటిని ఉపయోగిస్తారు.
పూర్వం ఈ పడవ పందేలను... పంటకోతకు వచ్చే సమయంలో మాత్రమే పంపానదిలో నడిపేవారట. కాలక్రమంలో ఇది సంప్రదాయంగా మారి ఆధునిక కాలంలో పోటీలుగా మారాయి. కాగా, అద్భుతమైన ప్రకృతి అందాలతో పాటు ఈ స్నేక్ బోట్ విన్యాశాల వన్నెలు కూడా చేరడంతో కేరళ రాష్ట్రం చక్కని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
|