ఏ రంగంలో ఉన్నవారైనా గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తుంటారు. కానీ భార్యా భర్తల మధ్య ఎవరిది గెలుపని ఇరువురు పోటీపడితే మాత్రం ఇద్దరిపైనా అశాంతి విజయం సాధించి వారు ఓడిపోతారు. దీనికి మన పురాణాల్లో ఓ చక్కని ఉదాహరణ ఉంది. ఒకసారి శ్రీ కృష్ణుడు విందును ఏర్పాటు చేస్తాడు. విందు ఎవరికెవరికి ఇవ్వదలిచాడో వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తాడు.తన ప్రాణ సఖి అయిన రాధను మినహా అందరినీ ఆహ్వానించాడు. నల్లనయ్య స్నేహితుడొకరు ఈ విషయాన్ని గుర్తు చేస్తే కృష్ణుడు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. దాంతో రాధను ఆహ్వానించకపోతే బాగోదని శ్రీకృష్ణుని స్నేహితుడు రాధవద్దకు వెళ్లి ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించాడు. విందు ఆహ్వానాన్ని కృష్ణుడు కాక శ్రీకృష్ణుని స్నేహితుని ద్వారా అందుకున్న రాధ అతనితో... " మీ ఇంట్లో ఏదైనా విందు జరిగితే మిమ్ములను మీరు ఎప్పుడైనా ఆహ్వానించుకున్నారా...?" అని ప్రశ్నిస్తుంది. ఆ మాటతో అతను ఆశ్చర్యం చెందుతాడు. ఆ తర్వాత అతనితో... నేనూ కృష్ణుడు వేరు వేరు కాదు... ఇద్దరం ఒకటే. నేనే ఆయన... ఆయనే నేను అని చెపుతుంది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరు కాదు.... ఒక్కటే. |