తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో దళితులకు ప్రవేశం కల్పించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఈ పాఠశాలల్లో చేరే ప్రతి దళిత విద్యార్థికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది.ఆళ్వారు దివ్య ప్రబంధాలను తెలుగులోకి అనువదించడానికి ప్రత్యేకంగా సంపాదక వర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అన్నమయ్య జయంత్యుత్సవాలను సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెలలో హైదరాబాదులో నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇదిలావుండగా రాష్ట్రవ్యాప్తంగా అరవై సంవత్సరాలుపైబడిన వేదపండితులకు లక్షరూపాయల చొప్పున ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, చిత్తూరు జిల్లలోని పలమనేరులో ఎస్.వి. గోశాల ఏర్పాటు చేయాలని అలాగే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మీనారాయణ ఆలయంలో స్తూపం ఏర్పాటుకు, విజయనగరం జిల్లా నెలిమర్ల మండలంలోని రామ తీర్థంలో రాజగోపురం నిర్మాణానికి రూ. 25 లక్షల చొప్పున నిధులు సమకూర్చేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదముద్రవేసింది. |