తెలుగు సంవత్సరంలో చిట్టచివరి నెలలో వచ్చే పూర్ణిమ ఇది. లోకంలో కూడా ఎవరికైనా చివరి సంతానం అంటే చెప్పలేని ఇష్టం ఉంటుంది. భారతంలో కూడా కుంతీదేవి అరణ్యాలకు వెళుతున్న పాండవులందరిలో సహదేవుణ్ణి దగ్గరికి తీసుకుని మరింతగా బాధపడిందని చెప్తాడు తిక్కన సోమయాజి. అలాగే ఇది సంవత్సరం చివర్లో వచ్చే పూర్ణిమ కాబట్టి మరింత ఇష్టం ఉండటం సహజం.
మరో రహస్యం ఏమిటంటే... ఈ పూర్ణిమ ఎండిన చెట్లతో రాలిన ఆకులతో బీడు పడిన పంటన చేలతో ఏ మాత్రపు సౌందర్యమూ లేకుండా ఉంటుంది. ఈ విశేషాన్ని గమనించిన పెద్దలు సహజ సౌందర్యాన్ని గుర్తింప చేయాలనే తలంపుతో ఈ పూర్ణిమని ఓ పండుగగా నిర్ణయించారు. హేలికా పూర్ణిమ అని పేరు పెట్టారు.
సంస్కృతంలో హేలా అంటే విలాసం లేదా వినోదమని అర్థం. ఏ పూర్ణిమ పూర్తి విలాసంతో లేదా వినోదంతో గడపాల్సి ఉందో ఆ పూర్ణిమని హేలికా పూర్ణిమ అన్నారు వాళ్లు. కాబట్టి ఈ పండుగను పూర్తి వినోదాత్మకంగా గడపాలన్నమాట. ఈ హేలికా పూర్ణిమే కాలక్రమంలో హోలీగా మారింది.
అయితే హోలీ ఆడేటప్పుడు వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచేటటువంటి దుస్తులు ధరించాలి. కళ్లజోడు పెట్టుకుంటే ఇంకా మంచిది. తలకు క్యాప్ పెడితే జుట్టు పాడయ్యే అవకాశం ఉండదు. రంగులలో ఎక్కువసేపు నానకుండా వెంటనే తలస్నానం చేయాలి. కొందరు పిల్లలు మీద పడిన రంగులను అలాగే ఉంచుకుని తిరుగుతుంటారు. కానీ రంగులు చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి గోరు వెచ్చని నీటితో స్నానం చేసి రంగుల ప్రభావాన్ని వదిలించుకోవాలి.
హోలీ ఆడేవారంతా రంగుల్లో రసాయనాలను కలపి చల్లడం మానుకుంటే మంచిది. రసాయనాలు కలిపిన మందులు పిల్లలపై ప్రమాదవశాత్తూ పడితే సమస్యలు వస్తాయి. కనుక రసాయనాలు లేని రంగులతో ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి మరి..!!