ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్న అమ్మ, కనకదుర్గమ్మ తల్లి శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. నవరాత్రుల్లో నాలుగోరోజైన మంగళవారం జగజ్జనని దుర్గమ్మ.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిస్తోంది.
గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
ముస్తాబవుతోన్న అమ్మవారి హంసవాహనం: మరోవైపు దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ రోజున నిర్వహించే తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గాఘాట్‌లో హంసవాహనం ముస్తాబవుతోంది. ఇప్పటికే హంసవాహనానికి రంగులద్దే పనులు తుది దశకు చేరుకోగా, నదిలో పడవపై సగం పనులు పూర్తయ్యాయి.
ముందస్తు చర్యగా అధికారులు రెండు రోజుల్లో హంసవాహనాన్ని నదిలో ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల్లో హంసవాహనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.