ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » మహానవమి నేడే: దేవదేవిని ప్రార్థించండి! (Navami| Navratri| Ashwini Nakshatra| Pournami| VijayaDasami)
 
Durga
WD
అశ్వినీ నక్షత్రములో కూడిన పౌర్ణమికల మాసం ఆశ్వయుజ మాసం. శరద్రుతువు కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఆశ్వయుజశుద్ధ పాఢ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి.

తొమ్మిది రోజుల పాటు దేవిని భక్తులు నిష్టతో పూజిస్తారు. అందువల్లే దీనికి దేవీనవరాత్రులని, అలాగే శరదృతువులో జరుపుకునే తొమ్మిది రోజుల పండుగనే శరన్నవరాత్రులని అంటారు.

మానవకోటిని పునీతులను చేసేందుకు భగీరథుడు గంగను దివినుండి భువికి తెచ్చింది మహార్నవమినాడే. నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైన దినంగా పరిగణించబడే ఈ నవమి తిధిని గురించి చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే.. తొమ్మిదవ రోజు మంత్ర సిద్ధి కలుగను కావున "సిద్ధదా" అని నవమికి పేరు.

దేవీ ఉపాసకులు అంతవరకు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తుంటారు. ఇలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల నిచ్చి సర్వాభీష్ట సిద్ధిని అమ్మవారు కలుగజేసేది మహా నవమి రోజునేనని పురోహితులు చెబుతున్నారు. ఈ రోజునే కార్మికులు, వాహన యజమానులు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

ఉత్తర భారతదేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై చివరి రోజైన దశమిరోజు (విజయదశమినాడు) "రావణవధ" మహా కోలాహలంగా జరుగుతుంది. అంటే చెడును జయించి మంచికి పట్టంకట్టడమనేదే దీని అర్థమని పురోహితులు చెబుతున్నారు.

అట్టి మహిమాన్వితమైన మహా నవమి రోజున (నవరాత్రుల్లో తొమ్మిదోరోజు) ఐదు గంటలకు లేచి, శుచిగా తలస్నానము చేయాలి. పూజామందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు, పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు పెట్టుకోవాలి. ఎర్రటి పట్టు బట్టలు ధరించి పూజకు ఉపయోగపడు వస్తువులను సిద్ధం చేసుకోవాలి.

మహానవమి రోజున మహిషాసుర మర్ధినీ, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటానికో ఎర్రటి పువ్వులు, జమ్మిపువ్వులు, కనకంబరాలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లను, దీపారాధనకు నువ్వుల నూనెతో 9వత్తుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.

సాయంత్రం ఆరుగంటల నుంచి 9 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు ముందుకు కకారకాళికాదేవి అష్టోత్తరము, మహిషాసుర మర్ధినీ, మహిషాసుర సంహారము వంటి సహస్రనామాలను పఠించవచ్చు.

అలా కుదరని పక్షంలో "శ్రీ మాత్రేనమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చే ముత్తైదవులకు శరన్నవరాత్రి ఉత్సవములు అనే పుస్తకాన్ని తాంబూలముతో చేర్చి అందిస్తే శుభఫలితాలుంటాయని పెద్దలంటున్నారు.

అలాగే ఆలయాల్లో మహిషాసుర మర్థిని అష్టోత్తర పూజ, లలితాసహస్రనామము కుంకుమార్చన చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత అందరూ ఆ దుర్గమ్మ తల్లిని నిష్టతో పూజించి.. ఆమె అనుగ్రహాన్ని పొందుదుము గాక...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.