ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » విజయదశమినాడు శమీపూజ చేయండి (VijayaDasami| Durga Devi| Navratri| Ramayana| MahaVishnu| Pandavas| Rama)
 
Durga
WD
పూర్వం దేనదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే "విజయదశమి"గా పేర్కొంటున్నారు. శ్రవణానక్షత్రంలోకలిసిన ఆశ్వీయుజ దశమికి విజయా సంకేతమున్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చినది.

ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణాలో ఈ పండుగ దినాలలో "బతుకమ్మ పండుగ"ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. "రామలీల ఉత్సవాలు". పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.

అందుచేత విజయదశమినాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానము చేసుకోవాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
Durga
WD


ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.

ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే... "శ్రీ మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.

ఇకపోతే.. విజయదశమి నాడు శ్రీశైలం, దుర్గాదేవీ ఆలయాలను సందర్శించడం మంచిది. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామము, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.

అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది.. "శమీపూజ". శమీవృక్షమంటే.. జమ్మిచెట్టు.. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు.

తిరిగి అజ్ఞాతవాసము పూర్తికాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున "అపరాజితా" దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటున్నాయి.
Durga
WD


అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ "అపరాజితాదేవి"ని పూజించి రావణుని సంహరించి విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం "పాలపిట్ట"ను చూసే ఆచారం కూడా ఉంది.

"శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని ||"

అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

అందుచేత.. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందడానికి.. విజయదశమినాడు అమ్మవారిని ప్రార్థిద్ధాం..! అందరికీ దసరా శుభాకాంక్షలు..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.