వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం వివరాలను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్ అలీ విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరిగేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వైఎస్ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గణేష్ ఉత్సవాలు, రంజాన్ పండుగలు శాంతియుతంగా జరగాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరినట్టు చెప్పారు.
ఇందుకోసం సుమారు 30 వేల మంది సిబ్బందిని మోహరించనున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 వేల మంది, సైబరాబాద్ ప్రాంతంలో నాలుగు వేల మందిని భద్రత నిమిత్తం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. విద్యుత్ సౌకర్యం, మంచి నీటి వసతులు, రోడ్ల మరమ్మత్తులు తదితరాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వివరించారు.
|