తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని తితిదే సమాచార కేంద్రానికి 30 వేల లడ్డూలను సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించింది. వీటిని ఆలయానికి వచ్చే భక్తులకు విక్రయిస్తారని తితిదే చెన్నై సమాచార కేంద్ర స్థానిక కమిటీ అధ్యక్షుడు కె.ఆనంద కుమార్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో లడ్డును రూ.25కు విక్రయించనున్నట్టు చెప్పారు.
15 వేల లడ్డూలను తొలి ఆదివారం, మూడో శనివారాల్లో విక్రయిస్తామన్నారు. ఇప్పటికే ప్రతినెలలో మొదటి ఆదివారం నాడు పది వేల లడ్డూలను విక్రయిస్తున్నట్టు చెప్పారు. అయితే స్థానికంగా లడ్డూలకు మంచి డిమాండ్ ఉందని, అందువల్ల అదనంగా సరఫరా చేయాలని తితిదే ఎగ్జిక్యూటివ్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
తమ విజ్ఞప్తి మేరకు మొత్తం 30 వేల లడ్డూలను సరఫరా చేసేందుకు తితిదే పాలకమండలి సమ్మతించినట్టు ఆనంద్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే తమిళ నెల పురట్టాసి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 16 వరకు ప్రతి శనివారం లడ్డూల విక్రయం సమాచార కేంద్ర వద్ద జరుగుతుందని ఆయన వివరించారు.
|