కాణిపాకంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వరసిద్ధి వినాయకుడు నెమలి వాహనంపై ఊరేగాడు. ఈ ఊరేగింపులో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉదయమే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో సువాసన గల రకరకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయంలోని అణివేటి మండపంలో ఉత్స విగ్రహాలను ఉంచి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన నెమలి వాహనంపై స్వామివారిని కూర్చోబెట్టి ఊరేగించారు.
కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మూషిక వాహనంపై స్వామి వారు ఊరేగనున్నారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లె, ఆగరంపల్లె, పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
|