రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలకు కార్తీకమాసం స్పెషల్ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పంచారామల సందర్శన పేరుతో ఈ పర్యటన ఉంటుందని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు వెల్లడించారు.ఇంతేకాకుండా సూర్యదర్శిని పేరుతో అరసవిల్లి, ఆ సమీప ఆలయాలకు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అరకు లోయకు కూడా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ విశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా... రాష్ట్రంలోని ఐదు శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధం. పూర్వం సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై ఐదు ప్రదేశములలో పడినవని, అవే ఐదు క్షేత్రాలుగా వెలశాయని శాస్త్రోక్తం.ఇకపోతే... కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమరారామము, ద్రాక్షారామము, భీమారామము, కుమార భీమారామము, క్షీరారామము అనే పంచారామ క్షేత్రములలో భక్తుల సమూహం అధికంగా ఉండటంతో... వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. |