నూతన సంవత్సరం సందర్భంగా ఎస్‌వి భక్తి ఛానెల్ భక్తులకు అరుదైన భాగ్యాన్ని కల్పిస్తోంది. అదేమిటో తెలుసా? భక్తులకు వచ్చే ఏడాది జనవరి 14 నుంచి తిరుమల గర్భాలయంలో మూలవిరాట్ట స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాలను వీక్షించే భాగ్యం కలుగబోతుంది.భక్తులు మరింత ఆధ్యాత్మికానుభూతి పొందే రీతిలో... ప్రత్యేకంగా వెంకన్న గర్భాలయ సెట్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌వి భక్తి ఛానెల్ సీఈవో కె.ఎస్. శర్మ అన్నారు. ఈ సెట్టింగులో వెంకన్న మూలవిరాట్టుని రూపం ఉంటుందని, ఈ రూపానికి గర్భాలయంలో నిత్యం జరిగే పూజలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా... సుప్రభాతం, అర్చన, తోమాల సేవ, వారపు పూజలు వంటి వాటిని ప్రసారం చేయనున్నట్లు శర్మ తెలిపారు. వెంకన్న స్వామి వారికి వస్త్రం సమర్పించడానికి 2050 ఏడాది వరకు కూడా ఖాళీ లేదన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని శర్మ వెల్లడించారు. |