శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఆయన భక్తులు నిత్యం కానుకల వర్షం కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మలయప్పస్వామికి కానుకగా విలువైన కెంపుల కిరీటం, రెండు పసిడి హారాలను బెంగళూరుకు చెందిన భక్తుడు బి.ఎల్. జయధర్ సమర్పించారు. సుమారు 30లక్షలకు పైగా విలువైన ఈ ఆభరణాలను సోమవారం ఆలయ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి జయధర్ అందజేశారు. రెండు కిలోల బంగారంతో నవరత్నాలు పొదిగిన ఈ ఆభరణాలను ఉత్సవర్లకు అలంకరించేందుకు వీలుగా తయారు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, కైశిక ద్వాదశి మహోత్సవం సందర్భంగా శ్రీవారు సోమవారం వేకువ జామున ఉగ్రశ్రీనివాస మూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలకు అనంతరం మంగళవాయిద్యాల నడుమ బ్రహ్మగడియలైన 4.30 గంటలకు శ్రీనివాసమూర్తిని మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. సూర్యోదయం గడియలు ప్రారంభానికి ముందే వెంకన్నను ఆలయ ప్రవేశం చేశారు. |