క్రిస్మస్ సెలవు దినాలకు తోడు.. నూతన సంవత్సరం, ముక్కోటి, సంక్రాంతి పండుగలు వరుసగా వస్తుండటంతో తిరుమల గిరులు సందడే సందడిగా ఉంది. నిత్యం భక్తులతో శోభాయమానంగా ఉండే ఏడు కొండలు ఈ పండుగలతో మరింత కళను సంతరించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా జన సందోహం కనిపిస్తోంది. రెండవ క్యూకాంప్లెక్స్ భక్తులతో పూర్తిగా నిండిపోయి రాంభగీచ అతిథి గృహాల వరకు క్యూలైన్లు వ్యాపించాయి. రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) యంత్రాంగం మహాలఘుదర్శనాన్ని కొనసాగిస్తోంది. వీటికి తోడు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఊహించని రద్దీతో యంత్రాంగం సిఫార్సులపై ఇచ్చే సెల్లార్ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసింది. అన్నదానం డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి ఎస్‌ఎంసీ ప్రాంతంలో క్యూలైన్ల పరిస్థితిని సమీక్షించి వారికి ఆహార పొట్లాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర విచారణ కార్యాలయ ప్రాంతంతో సహ వీఐపీలకు గదులు కేటాయించే శ్రీపద్మావతి, శ్రీవేంకటేశ్వర అతిథిగృహ విచారణ కార్యాలయాల వద్ద గదుల కోసం భక్తులు పెద్ద ఎత్తున గుమికూడారు. |