తిరుమల వేంకటేశ్వరుని దర్శనార్థం సిఫారసు ఉత్తరాలపై మంజూరు చేసే సెల్లార్ టిక్కెట్ల పంపిణీకి త్వరలో బయోమెట్రిక్ పద్దతిని ప్రవేశపెట్టాలని తితిదే భావిస్తోంది. ప్రస్తుతం సెల్లార్ టిక్కెట్ల విక్రయంలో తితిదే అమలుచేస్తున్న నియమాలను దళారీలు తమకు అనుకూలంగా మలచుకుని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు టీటీడీ గుర్తించింది. ఇప్పటికే బ్యాంకు కోటాలో ఇచ్చే ఏఏడీ టిక్కెట్లకు బయోమెట్రిక్ విధానాన్ని తితిదే అమలు పరుస్తోంది. ఇదే తరహాలో వీఐపీలకు కేటాయించే సెల్లార్ టిక్కెట్లకు కూడా ఈ విధానాన్ని అమలు పరచాలని తితిదే సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ విధానాన్ని అమలు చేస్తే వీఐపీలు స్వయంగా టిక్కెట్ల కోసం వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వీఐపీల నుంచి బయోమెట్రిక్ విధానానికి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి.ఇదిలా ఉండగా... తిరుమల నిర్వాసితులు గత ఐదు రోజులుగా చేపట్టిన దీక్షలను విరమించారు. నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం నాయకులు తితిదే ఈవోతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో తిరుమల నిర్వాసితుల దీక్షలకు ఫలితం దక్కనుంది.తిరుమలలోని పెరిందే వమ్మతోట, చంద్రబాబు తోటలోని నిర్వాసితులకు, 2002లో తిరుమల నుంచి తరలించిన వారికి, శేషాచలనగర్‌లో ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఎస్టేట్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమల నిర్వాసితుల ఆవేదనను తితిదే యాజమాన్యం గుర్తించిందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. |