ముంబయి పేలుళ్ల నేపథ్యంలో... నిఘా నీడలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇదే తరహాలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలోనూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరుమల కొండ భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. సీసీ కెమేరాలతో పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు అప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొండపై ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు... కొత్త సంవత్సరం సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చే భక్తులతో శ్రీవారి ఆలయం కిటకిటలాడుతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరం వెంకన్న సన్నిధిలో గడపడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో కాటేజీలు దొరకక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే... కొత్త సంవత్సరం అర్థరాత్రి 12.05 గంటల నుంచి 1.45 గంటల వరకు శ్రీవారికి తిరుప్పావై, తోమాల ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. 1.45 గంటల నుంచి 2.30 గంటల వరకు ప్రొటోకాల్ వీఐపీలను అనుమతిస్తారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా 2.45 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.ఉదయం 9 గంటల నుంచి ఉచిత, రూ. 50 సుదర్శనం టికెట్లు పొందిన భక్తులను అనుమతిస్తారని తితిదే వెల్లడించింది. పదిగంటల తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో సెల్లార్ టిక్కెట్లు మంజూరు చేస్తారు. ఇందుకోసం గోకులం అతిథి గృహం ప్రాంతంలో ప్రత్యేకంగా ఆరు సెల్లార్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎలాంటి కొరత లేకుండా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు వారు చెప్పారు. |