ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ పుణ్యక్షేత్రమైన చెన్నయ్ నగరంలోని తిరువళ్లికేణి శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 108 వైష్ణవ క్షేత్రాలలో పేరొందిన శ్రీ పార్థసారథి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయరామన్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. అనునిత్యం భక్తులతో రద్దీగా ఉండే పార్థసారథి ఆలయం, వచ్చే ఏడో తేదీన అశేష భక్తజన ప్రవాహంతో పోటెక్కనుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన పార్థసారథి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రెండులక్షల రూపాయల వ్యయంతో ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించనున్నట్లు వెల్లడించారు. స్వామివారికి వైకుంఠ ఏకాదశి సేవలు ఆరోతేదీ అర్థరాత్రి నుంచి రెండు గంటల వరకు విశ్వరూపాలంకరణ నిర్వహించనున్నట్లు జయరామన్ తెలిపారు. ఏడో తేదీ తెల్లవారుజామున 2.30 నుంచి మూలవిరాట్టు దర్శనం, 4 గంటలకు ఉత్సవమూర్తి ఊరేగింపు, తెల్లవారుజామున 4.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరవడం వంటి కార్యక్రమాలు ఉంచాయని తెప్పారు. పోలీసు భద్రత పటిష్టం వైకుంఠ ఏకాదశి రోజున భారీ ఎత్తున పార్థసారథి ఆలయానికి తరలివస్తారనే అంచనా వేస్తున్నారు. అందువల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను కల్పించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఆలయం వెలుపల, ప్రాంగణం లోపల 15 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు అగ్నిమాపక వాహనాలు సిద్ధం చేస్తున్నామని జయరామన్ తెలిపారు. ఆలయ ప్రవేశ మార్గాల్లో మెటల్ డికెక్టర్లను అమర్చుతున్నట్టు చెప్పారు. భక్తులకు సర్వదర్శనం ఏకాదశి రోజున భక్తుల సౌకర్యార్థం నిరంతర దర్శనం కోసం ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేశామని జయరామన్ అన్నారు. ఆ రోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామని ఆయన తెలియజేశారు. ధర్మదర్శనాలు, వీఐపీ, ప్రత్యేక దర్శనాలు యధాతధంగా జరుగుతాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు. పార్థసారథిని దర్శించుకునే 75 వేల భక్తులకు ఉచితంగా లడ్డు, కలకండ, కుంకుమ ప్రసాద ప్యాకెట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. |