లోకంలో మనుషులంతా ఒక్కటేనని, కులమత తారతమ్యాలను విడనాడాలని ఉద్భోధించిన గొప్ప సంఘసంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వామివారు. 17వ శతాబ్దంలో కలియుగంలో జరుగబోయే వింతలు, విశేషాలు తన కాలజ్ఞాన మహిమ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు బుధవారం (ఫిబ్రవరి 4) నుంచి వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మంగారి ఏడోతరం మనుమడు, కందిమల్లయ్య పల్లి పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి చేతుల మీదుగా ప్రతిష్ట జరుపుకున్న విజయవాడ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో ఈ మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. చల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇదే తరహాలో.. మాఘశుద్ధ దశమి, బుధవారం ఉదయం 11 గంటలకు కలశ ప్రతిష్ట, అఖండజ్యోతి, మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరుగనుంది. ఇదేవిధంగా... గురువారం (ఫిబ్రవరి 5) ఉత్సవ విగ్రహమూర్తులతో స్వామివారి ఊరేగింపు, శుక్రవారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని నిర్వహించనున్నట్లు చల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ ఉత్సవాల సందర్భంగా.. బుధ, గురువారాల్లో భజనలు, హరికథలు, శుక్రవారం కోలాట ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆ ప్రకటనలో తెలియజేశారు. |