సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్త కన్నప్పకు తొలిపూజ జరుగనుంది. కాళహస్తీశ్వర క్షేత్రం నుంచి స్వామి అమ్మవార్లను.. కైలాస గిరులపై కొలువైన కన్నప్ప ఆలయానికి ఊరేగింపుగా చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కన్నప్ప ఆలయంలోనే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. తొలిరోజైన బుధవారం శ్రీ కన్నప్ప ధ్వజారోహణం తర్వాత అంకుర్పారణం కార్యక్రమం వైభవంగా జరుగనుంది. ఇదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు ఆంధ్రనాట్య ప్రదర్శన, రాత్రి 10.30 గంటలకు పేరిణి శివతాండవం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో శివాజి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని శివాజి అన్నారు.ఇదిలా ఉండగా.. వాయులింగేశ్వర రూపంలో ముక్కంటి కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయం కైలాస గిరులవద్దే ఉండటం అందరికీ తెలిసిందే. కైలాస గిరులపై కొలువైన కన్నప్ప.. లోకంలోని భక్తులందరికీ ఆదర్శం. అటువంటి భక్తునికి తొలిపూజలందించే గౌరవం దక్కించిన భోళాశంకరుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆలయ వేదపండితులు చెబుతున్నారు. |