జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజైన బుధవారం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దివ్యస్వరూపుడిగా అలంకృతమై మయూరవాహనంపై ఆలయ వీధుల్లో విహరించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన, నవవరణార్చనలు నిర్వహించారు. బుధవారం రాత్రి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆదిదంపతులు భక్తులకు అభయప్రదానం చేస్తూ పురవీధుల్లో ఊరేగారు. శివరాత్రి ఉత్సవాలకు తరలి వచ్చిన అశేషభక్తనంతో మల్లన్న ఆలయం నిండిపోయింది.బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ మయూరవాహన సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని మల్లన్న, భ్రమరాంబికాదేవీలకు కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. స్వామివార్ల ఉత్సవమూర్తులను కృష్ణదేవరాయల గోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలు వీరభద్రస్వామి మండపం చేరుకుని తిరిగి రాత్రి పదిగంటలకు ఆలయ ప్రాంగణం చేరింది. ఈ ఉత్సవంలో కోలాటం, లంబాడి నృత్య కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. |