ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నాలుగో రోజైన గురువారం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై ఊరేగుతూ, భక్తులకు అభయప్రదానం చేశారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను దివ్యసుందరంగా అలంకరించి, భృంగివాహనంపై అధిరోహింపజేసి, ఆలయ ప్రాంగణంలోని దక్షిణ ద్వారం వద్ద విశేష పూజలు నిర్వహించారు.అనంతరం మల్లన్న ఆలయ వీధుల్లో విహరించారు. ప్రదక్షిణానంతరం భ్రమరాంబికాదేవీ సమేత మల్లన్న స్వామిని రథశాల వద్దకు చేర్చి, ప్రత్యేక పూజల అనంతరం గ్రామోత్సవం ప్రారంభమైంది. నందిమండపం, బయలు వీరభద్ర స్వామి ఆలయం వంటి తదితర ప్రాంతాల్లో స్వామివారిని ఊరేగించి, రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేర్చారు.మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవీలు భృంగి వాహనంపై విహరించిన వైనాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు శ్రీశైలం చేరారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు.ఇదిలా ఉండగా... బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం అశేష భక్త జనప్రవాహంతో కిటకిటలాడుతోంది. శివదీక్ష పూనిన భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. |