ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శుక్రవారం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆలయ ప్రాంగణంలోని దక్షిణ ద్వారం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను దివ్యసుందరంగా అలంకరించి, రావణ వాహనంపై అధిరోహింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ వీధుల్లో వైభవంగా విహరింపజేశారు. తర్వాత ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు వద్దకు స్వామివార్లను తీసుకొచ్చి, అక్కడ ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ గ్రామోత్సవం నందిమండపం, అంకాళమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వైభవంగా సాగింది.రావణాసురిడిపై ఊరేగిన శ్రీశైలేశ్వరుడిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కైలాస నాధుడి ఆలయం అశేషభక్తజనసందోహంతో నిండిపోయింది. |