శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవోపేతంగా ముగిసింది. గురువారం తెల్లవారుజామున జరిగే కళ్యాణానికి స్వామి, అమ్మవారు బుధవారం రాత్రి బయలుదేరారు. వధూవరులైన శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబలు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో, పట్టు పీతాంబర వస్త్రాలతో చక్కగా ముస్తాబై ఆలయం వెలుపలికి వచ్చారు.కళ్యాణ మండపానికి వెళ్లేందుకు స్వామివారు గజవాహనంపై అధిరోహించగా, అమ్మవారు సింహవాహనంపై అధిష్టించారు. డప్పులు, ప్రమధ గణాలు, కోలాటాలు, వివిధ రకాల వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి అవసరమైన సామగ్రితో ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల వెంటనే వచ్చారు.మరోవైపు కళ్యాణం చేసుకోనున్న సోదరి జ్ఞానప్రసూనాంబకు తిరుమల వెంకన్న బుధవారం సాయంత్రం సారె పంపారు. ఈ సారెను టీటీడీ తరపున తిరుపతి జేఈవో శేషాద్రి సాయంత్రం పట్టువస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను తెచ్చారు. తిరుమల నుంచి వచ్చిన సారెకు కాళహస్తి ఆలయ అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు.ఇకపోతే.. వివిధ రకాలపై పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించబడిన కళ్యాణమండపంలో గురువారం తెల్లవారుజామున శ్రీకాళహస్తీశ్వర-జ్ఞానప్రసూనాంబల కళ్యాణం వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణమహోత్సవంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు వందలాది పెళ్లి జంటలు సామూహిక వివాహాలు చేసుకున్నాయి. |