తొలి వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు అన్నమాచార్యుని 601వ జయంతిని పురస్కరించుకుని, వైభవోపేతంగా నిర్వహించిన "లక్షగళ సంకీర్తనార్చన" గిన్నిస్ రికార్డును సృష్టించింది. సిలికానాంధ్ర సంస్థ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఒకేసారి లక్ష మంది గాయకుల సంకీర్తనార్చనలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మారు మ్రోగింది. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యంత వైభవంగా సాగిన ఈ లక్షగళ సంకీర్తనార్చన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. లక్షా 60వేల మందితో జరిగిన ఈ సంకీర్తనా కార్యక్రమం భేష్ అని గిన్నిస్ బుక్ ప్రతినిధి రేమండ్ మార్షల్ పేర్కొనే స్థాయికి ఈ కార్యక్రమం విజయవంతమైంది. 1937 ఆగస్టు 2వ తేదీన జర్మనీలో 60వేల మందితో నిర్వహించిన బృందగాన కార్యక్రమం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఇంతకాలం పదిలంగా ఉన్న ఈ రికార్డును అన్నమయ్య లక్షగళార్చన బద్దలు చేసింది. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గళ సారథ్యంలో సాగిన ఈ లక్షగళ సంకీర్తనార్చనతో వేలాది మంది భక్తులు, సంగీత అభిమానులు భక్తి పారవశ్యంలో మైమరిచిపోయారు. గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వయొలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి కవితా సుబ్రహ్మణ్యం ఆలాపన రక్తి కట్టించింది. లక్షగళ సంకీర్తనార్చనలో ఆలపించిన సుస్వరాలతో నింగీ, నేల పులకరించింది. సంగీతాభిమానుల హృదయాలు తరించాయి. మూడు గంటల పాటు కొనసాగిన కార్యక్రమంలో ఏకకాలంలో ఏడు సంకీర్తనలను లక్షమంది ఆలపించడం విశేషం. ఈ సంకీర్తనల లక్షగళంలో అధికంగా మహిళలతో పాటు చిన్నారి గాయనీగాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి రోశయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తితిదే ఈ.వో రమణాచారి, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, అక్కినేని నాగార్జున దంపతులతో పాటు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరోవైపు... లక్షగళ సంక్తీనార్చన ఒక అద్భుత కార్యక్రమమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అభివర్ణించారు. లక్షగళార్చన గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కడం తెలుగువారికి గర్వకారణమని చెప్పారు. |